టీజీ ఐసెట్–2025 (TGICET-2025) ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు, ప్రైవేట్ కళాశాలల్లో కలిపి మొత్తం 32595 ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏ కోర్సుల్లో 25,991 సీట్లు, ఎంసీఏ కోర్సుల్లో 6,404 సీట్లు ఉన్నాయి. సీట్ల వివరాలతో పాటు కౌన్సిలింగ్ తేదీలపై తెలంగాణ సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అత్యధికంగా ఎంబీఏలో 13,520 సీట్లు, ఎంసీఏలో 3,951 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన, పాలమూరు, ఇతర యూనివర్సిటీలు, ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఈసారి సీట్ల సంఖ్య పెరిగింది.
TGICET 2025 ముఖ్యమైన తేదీలు
- సర్టిఫికేట్ వెరిఫికేషన్: ఆగస్టు 22 నుంచి 29 వరకు
- ఆప్షన్ల నమోదు: ఆగస్టు 25 నుంచి 30 వరకు
- ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ చివరి తేదీ: ఆగస్టు 28
ఇప్పటివరకు 22,563 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీ చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో 14,301 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో సీటు లభించే అవకాశాలు కూడా మెరుగవుతాయని తెలిపారు.
షెడ్యూల్, హెల్ప్‌లైన్ సెంటర్ల సమాచారం tgicet.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంది.